ఢిల్లీలో రెండు హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్‌టీ చట్టాన్ని సరళతరం చేసి, పన్ను రేట్లను సవరించాలని కేంద్రం భావిస్తోందన్నారు. జీఎస్‌టీ తదుపరి తరం సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే రాష్ట్రాలకు పంపించామని, వాటి అమలుకు సహకరించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇందులో మార్పులు పేద, మధ్యతరగతి ప్రజలతోపాటు వ్యాపారులకూ ఎంతో ప్రయోజకరంగా ఉంటాయని అన్నారు. మా దృష్టిలో సంస్కరణలు అనేవి సుపరిపాలన పురోగతిని సూచిస్తాయి. సమీప భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాలు మరింత తేలికగా, సులభంగా మార్చే ఉద్దేశంతో సంస్కరణలు అమలు చేసేందుకు 'నెక్ట్స్ జెన్ జీఎస్‌టీ'తో సిద్ధమయ్యాం. వచ్చే దీపావళికి ఈ సంస్కరణలు రెట్టింపు బోనస్‌ను ఇస్తాయి. జీఎస్‌టీ సంస్కరణలకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. వీటికి అన్ని రాష్ట్రాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా దీపావళి మరింత అద్భుతంగా మారుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సంస్కరణల ప్రతిపాదనలపై చర్చించేందుకు వచ్చే నెలలో జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత రెండు శ్లాబుల విధానాన్ని జీఎస్‌టీ మండలి ఆమోదిస్తే, ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల్లో 12, 28 శాతం శ్లాబులు తొలగిపోనున్నాయి. 5%, 18% శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఇది 'గేమ్ ఛేంజర్' సంస్కరణగా మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. సుమారు ఆరు నెలల పాటు సాగిన చర్చలు, డజన్ల సమావేశాల తర్వాత ప్రతిపాదిత జీఎస్‌టీ విధానం తెరమీదకు వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
జీఎస్‌టీ చట్టాన్ని సరళతరం చేసి, పన్ను రేట్లను సవరించాలని కేంద్రం భావిస్తోంది !
August 17, 2025
0
Tags