విద్వేష ప్రసంగాల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

Telugu Lo Computer
0


విద్వేష ప్రసంగాల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్‌ స్వాతంత్ర్య విలువను పౌరులు తెలుసుకోవాలని, ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ శర్మిష్ఠా పనోలీపై ఫిర్యాదు చేసిన వజహత్‌ ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ''విద్వేష ప్రసంగాలు చేసే వారికి అవి ఎంత అసభ్యకరంగా, అనుచితంగా ఉంటున్నాయో ఎందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి వ్యాఖ్యలను షేర్‌ చేయకుండా కొన్ని కట్టడి చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి వాటిని షేర్‌ చేయకుండా సంయమనం పాటించాలి. మేం ఇక్కడ సెన్సార్‌షిప్‌ గురించి మాట్లాడట్లేదు. కానీ, ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విభజన ధోరణిని అడ్డుకోవాల్సిందే'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ''ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ, భావ ప్రకటనా స్వేచ్ఛపై బాధ్యతాయుత ఆంక్షలు సరైనవే. వాక్‌ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ విలువలను ప్రజలు అర్థం చేసుకోవాలి'' అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా విద్వేషపూరిత ప్రసంగాలను నిలువరించే మార్గాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)