తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముకేశ్ అంబానీ పంచుకున్నారు. 2016లో రిలయన్స్ జియోతో టెలికాం రంగంలోకి తిరిగి అడుగుపెట్టడాన్ని తన జీవితంలోనే 'అతిపెద్ద రిస్క్'గా అభివర్ణించారు. ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు భావించినప్పటికీ భారత దేశాన్ని డిజిటల్‌గా మార్చడంలో జియో పోషించిన పాత్రను తాను మరిచిపోలేనంటూ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ కంపెనీ మెకిన్సీ అండ్ కోకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఉచిత వాయిస్ కాల్స్, అతి తక్కువ ధరలో డేటా అందించడం ద్వారా 2016లో భారత టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది రిలయన్స్ జియో. దీంతో పోటీ సంస్థలు సైతం ధరలు తగ్గించాల్సి వచ్చింది. మొబైల్ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, తాను జియో 4జీ సేవలను ప్రారంభించాలని అనుకున్నప్పుడు చాలా మంది అనలిస్టులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని నాడు చెప్పారని అంబానీ గుర్తు చేశారు. ''ఆ సందర్భంలో మా బోర్డు సభ్యులతో ఒక్కటే చెప్పా. మనం ఎక్కువ రాబడి ఆర్జించకపోవచ్చు. అదేమంత పెద్ద సమస్య కాదు. ఇది మన సొంత డబ్బు. ఒక సంస్థగా రిలయన్స్ భారత దేశానికి అందించిన అత్యుత్తమ సేవ అవుతుంది. డిజిటల్ భారతంగా మార్చబోతున్నామని చెప్పా'' అంటూ నాటి రోజులను అంబానీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 47 కోట్ల మంది యూజర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా ఉంది. ''ఈ భూమ్మీదకు వచ్చేటప్పుడు ఏమీ లేకుండా వస్తాం. వెళ్లేటప్పుడు ఏమీ తీసుకెళ్లం. మీరు వదిలిపెట్టేది ఒక సంస్థ మాత్రమే!' అని నా తండ్రి ధీరూభాయ్ అంబానీ ఓ సందర్భంలో నాతో చెప్పారు. 'రిలయన్స్ ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ శాశ్వతంగా ఉండాలి. నీవు, నేను ఉన్నా లేకున్నా రిలయన్స్ కొనసాగాలి' అని నాతో చెప్పేవారు'' అని ముకేశ్ అంబానీ అన్నారు. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకోబోతోందని, వందేళ్లు పూర్తయినా కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు అంబానీ తెలిపారు. 1960, 70ల్లో రిలయన్స్.. 2000, 2020ల్లో రిలయన్స్‌ను చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. సంస్థ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోందన్నారు. టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడు మరిన్ని కొత్త అవకాశాలు వస్తాయని, వాటిని విడిచిపెట్టాలనుకోవడం లేదని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ''ఏదైనా ప్రారంభించేటప్పుడు అత్యంత ప్రతికూల సందర్భం ఏం ఎదురుకావొచ్చో ముందే ఆలోచించాలి. ఆ స్థితిని ఎదుర్కోగలడానికి ముందే సిద్ధం అవ్వాలి. నేను నమ్మే రిస్క్ మేనేజ్‌మెంట్ సూత్రాల్లో ఇది ఒకటి. 30, 40 ఏళ్ల క్రితం నా ఉద్యోగులతో కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. రిలయన్స్‌లో మా లీడర్లకు కళ్లలో చూసి మాట్లాడటం ముఖ్యమని చెప్తాం. ఎందుకంటే అది మీ నిబద్ధతను తెలియజేస్తుంది'' అని ముకేశ్ అంబానీ అన్నారు. ఏ రిస్క్ తీసుకోవడానికి సిద్ధం కావడమే రిలయన్స్ సంస్థాగత సంస్కృతి అని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
జియోతో టెలికాం రంగంలోకి తిరిగి అడుగుపెట్టడమే నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ : ముకేశ్ అంబానీ
June 25, 2025
0
Tags