ఢిల్లీ మహిళా కమిషన్ (డిసిడబ్ల్యు) చీఫ్ స్వాతిమాల్ మంగళవారం మణిపూర్ వీడియో బాధితులను కలిశారు. బాధితులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని, ఆ భయానక క్షణాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణాలతో బయటపడిన వారికి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి కౌన్సిలింగ్, న్యాయ సహాయం, లేదా పరిహారం అందలేదని అన్నారు. నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హింసాకాండకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, చివరికి సీనియర్ అధికారులు కూడా బాధితులను కలవలేదని ఆమె తెలిపారు. స్వాతి మలివాల్ మరో సభ్యురాలు వందనా సింగ్‌తో కలిసి మంగళవారం చురాచంద్‌పూర్ సహాయక శిబిరానికి చేరుకున్నారు. లైంగిక దాడికి గురైన బాధితురాలి తల్లి, మరో బాధితురాలి భర్తను కలిసినట్లు పేర్కొన్నారు. అల్లరి మూక నుండి తన కుమార్తెను రక్షించుకునే ప్రయత్నంలో తన భర్త, కుమారుడిని పోగొట్టుకున్నానని, అయినా తన కుమార్తెను రక్షించుకోలేకపోయానని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మృగాలు తనపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సహాయక శిబిరాల్లో తలదాచుకున్న వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ అని ఆమె తెలిపారు. మణిపూర్ హింసాకాండ ముసుగులో అల్లరి మూక అకృత్యాలకు బలైన వారి ఆవేదన వర్ణనాతీతమని అన్నారు. చురాచంద్‌పూర్ సహాయక శిబిరంలో 70 ఏళ్ల మహిళను కలుసుకున్నారు. లాంగ్‌చిక్ గ్రామానికి చెందిన ఆమె హింసాకాండలో తన కుమారుడిని పోగొట్టుకున్నట్లు తెలిపారు. మరో 34 ఏళ్ల మహిళ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని అల్లరి మూక చుట్టుముట్టారని, ఆ సమయంలోనే తాను ఓ బిడ్డకు జన్మనిచ్చానని చెప్పుకొచ్చారు. తన భర్త, బావమరిదిని చంపేశారని, తాను బిడ్డతో ఎలాగో బయటపడ్డానని చెప్పినట్లు తెలిపారు. బాధితులను కలుసుకునేందుకు తమకు మణిపూర్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదని డిసిడబ్ల్యు చీఫ్ స్వాతిమలివాల్ పేర్కొన్నారు. ఎలాంటి భద్రత లేకుండా, భారీ కాల్పుల మధ్య వారిని కలుసుకుని తీరాలని నిర్ణయించుకున్నానని, కలుసుకున్నానని అన్నారు. హింసాకాండ నుండి ప్రాణాలతో బయటపడినవారు ఊహకందని వేదన అనుభవిస్తున్నారని, ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ కార్యకర్తలు కానీ వారిని కలవకపోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ప్రజలకు భద్రతను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని అన్నారు. ప్రధానిమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, డబ్ల్యుసిడి మంత్రి స్మృతి ఇరానీతో కలిసి మణిపూర్‌లో పర్యటించాలని ఆమె తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. https://t.me/offerbazaramzon
మణిపూర్ వీడియో బాధితులను కలిసిన స్వాతిమాల్ !
July 25, 2023
0
Tags