స్విట్జర్లాండ్‌కు చెందిన ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే సంస్థ తన కింది ఉద్యోగితో సీక్రెట్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నందుకు సీఈఓ లారెంట్ ఫ్రెక్సీని సంస్థ విధుల నుంచి తొలగించింది. సంస్థ నియమావళి ఉల్లంఘించినందుకు ఫ్రెక్సీని తొలగించినట్టు నెస్లే సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో జరిపిన అంతర్గత దర్యాప్తులో ఫ్రెక్సీ సంబంధం గురించి తెలిసినట్టు పేర్కొంది. ఈ దర్యాప్తును సంస్థ చైర్మన్ పాల్ బల్కీ స్వయంగా పర్యవేక్షించారని తెలిపింది. సీఈఓను తొలగించక తప్పలేదని చైర్మన్ పాల్ బల్కీ పేర్కొన్నారు. నెస్లే పాలన వ్యవస్థ మాత్రం యథాతథంగా కొనసాగుతోందని చెప్పారు. నైతిక విలువలు, పరిపాలనా విధానమే సంస్థకు బలమైన పునాదులని వ్యాఖ్యానించారు. ఫ్రెక్సీ స్థానాన్ని నెస్లే సీనియర్ ఉద్యోగి ఫిలిప్ నవ్రాటిల్ భర్తీ చేయనున్నారు. 2001లో నవ్రాటిల్ ఇంటర్నల్ ఆడిటర్‌గా సంస్థలో చేరారు. సెంట్రల్ అమెరికా కార్యకలాపాలకు సంబంధించి పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో సంస్థకు చెందిన కాఫీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్‌కు బదిలీ అయ్యారు. 2024లో నెస్లే నెస్‌ప్రెస్సో విభాగం బాధ్యతలు చేపట్టారు. నెస్లే కొంత కాలంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సుంకాలు, పెరుగుతున్న ముడిసరుకు ధరలు సంస్థకు ఇబ్బందికరంగా మారాయి. కాఫీ, కొకోవా గింజలు వంటి ముడిసరుకుల ధరల పెరిగినప్పటికీ తుది ఉత్పత్తలు ధరలు కూడా పెరగడంతో సంస్థపై కొంత భారం తగ్గిందని నెస్లే జులైలో పేర్కొంది. ఇటీవల ఆస్ట్రానమర్ సంస్థ సీఈఓ యాండీ బ్రయన్ కూడా దాదాపు ఇదే రీతిలో ఉద్యోగం పోగొట్టుకున్న విషయం తెలిసిందే.
ఉద్యోగినితో సీక్రెట్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నందుకు సీఈఓ లారెంట్ ఫ్రెక్సీని తొలగించిన నెస్లే
September 02, 2025
0
Tags