కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోంది !

Telugu Lo Computer
0


తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ ఆరోపణలకు బలమిచ్చేలా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. కానీ దీనికి సంబంధించి ఆర్థిక అక్రమాలు, నాణ్యతా లోపాలు, కాంట్రాక్టుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ, ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని ప్రతిపక్షాలు పదేపదే విమర్శించాయి. సీబీఐ విచారణ ప్రకటన వెలువడిన వెంటనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి 'తెలంగాణ కరెన్సీ మేనేజర్ (సీఎం)' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ నిజమైన అభివృద్ధి కోసం కృషి చేయకుండా, ప్రతీకార రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, సీబీఐ విచారణతో ఎలాంటి నిజం బయటపడదు, ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మాత్రమేనని అన్నారు.అంతేకాకుండా.. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీబీఐని 'విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్'గా అభివర్ణించారని గుర్తు చేస్తూ 'మిస్టర్ గాంధీ, మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో మీకు తెలుసా?' అని ప్రశ్నించారు. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల స్క్రీన్‌షాట్‌ను కూడా కేటీఆర్ జత చేశారు. రేవంత్ సర్కార్ నిర్ణయం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అయినప్పటికీ తమ పోరాటాన్ని రాజకీయంగా, న్యాయపరంగా కొనసాగిస్తామని న్యాయవ్యవస్థపై, ప్రజలపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)