ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఎంపిక !

Telugu Lo Computer
0


స్ట్రేలియాలో జరుగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అయిన కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్‌కు ముందే టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ తప్పించి శుభ్‌మన్ గిల్‌ను సారథిగా నియమించారు. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా, కోహ్లీతో పాటు రోహిత్ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీని దృష్టిలో పెట్టుకొనే కెప్టెన్సీ మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చాడు. ఈ సిరీస్‌తోనే కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో రాణిస్తేనే వారు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. లేదంటే వారే స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని రవి శాస్త్రి అభిప్రాయపడ్డారు. దాంతో ఈ సిరీస్‌లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెర్త్ వేదికగా ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ వికెట్‌ పూర్తిగా పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టీమిండియా ముగ్గురు లేదా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మహహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగనుండగా, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి వారికి అండగా నిలవనున్నాడు. నాలుగో పేసర్ కావాలనుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై వేటు పడనుంది. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా అతనికే చోటు దక్కలేని పరిస్థితి నెలకొంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రానుండగా.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడుతాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన హర్షిత్ రాణాను 8వ స్థానంలో ఆడించనున్నారు. ముగ్గురు పేసర్లతో మాత్రమే ఆడితే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

Post a Comment

0Comments

Post a Comment (0)