వృద్ధురాలితో కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి దురుసు ప్రవర్తన !

Telugu Lo Computer
0


కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నారు. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఇటీవల తిరస్కరించిన మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్న సురేశ్‌ గోపి బుధవారం తన నియోజకవర్గమైన త్రిసూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదాన్ని రాజేశారు. సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్న కరువన్నూర్‌ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు చిక్కుకుపోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. కేంద్ర మంత్రిని కలిసిన ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్‌ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కోరారు. దీనికి సురేశ్‌ గోపి స్పందిస్తూ ''వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు. ఎక్కువగా మాట్లాడవద్దు'' అంటూ దురుసుగా చెప్పారు. ''మీరు కూడా మా మంత్రే'' అని మహిళ చెప్పగా ''నేను దేశానికి మంత్రిని'' అని ఆయన బదులిచ్చారు. ఈ ఉదంతం వైరల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని సురేశ్‌ గోపి హామీ ఇచ్చారని, ఆయన కటువుగా మాట్లాడకుండా తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేదని ఆనందవల్లి మీడియాకు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)