2020లో ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఇమామ్, ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్లు 2022 నుంచి పెండింగ్‌లో ఉండగా తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేసి వారు అల్లర్లకు పాల్పడ్డారని, దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు నిర్దోషులుగా తేలే వరకు జైల్లో ఉండడమే సరైనదని సొలిసిటర్ జరనల్ తుషార్ మెహతా వాదించారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో దాదాపు 53 మంది దుర్మరణం చెందగా, 700లకు పైగా గాయపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత తాహిర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ) కింద ఛార్జిషీటు నమోదు చేశారు.
ఢిల్లీ అల్లర్ల కేసు : ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
September 02, 2025
0
Tags