ఖాళీ మద్యం బాటిల్‌ రూ.20 !

Telugu Lo Computer
0


కేరళ ప్రభుత్వం ఖాళీ ప్లాస్టిక్‌ మద్యం బాటిల్‌ను సేకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఖాళీ మద్యం బాటిల్‌ వెనక్కి ఇచ్చినట్లయితే రిఫండబుల్‌ డిపాజిట్‌ కింద వసూలు చేసిన రూ.20ను తిరిగి ఇవ్వనుంది. సెప్టెంబర్‌ 10 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నిర్దేశించిన కౌంటర్లలో వీటిని సేకరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పైలట్‌ ప్రాజెక్టు కింద తొలి విడతలో 20 కేంద్రాల్లో అమలు చేయనున్నారు. తిరువనంతపురంలో పది, కన్నూర్‌ జిల్లాలో పది కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాటిళ్లపై ప్రత్యేకంగా రూపొందించిన లేబుల్‌ ద్వారా వీటిని గుర్తించనున్నట్లు బెవరేజెస్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. వచ్చే జనవరి 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 కేంద్రాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించే ఈ ప్రాజెక్టులో మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఈ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, మద్యం బాటిల్‌ కొనుగోలు చేసిన ప్రాంతంలోనే ఖాళీ బాటిల్‌ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. రద్దీ నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. సేకరించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు రీసైక్లింగ్‌ కోసం 'క్లీన్‌ కేరళ కంపెనీ'కి అప్పగించామని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)