రెండు దశాబ్దాల క్రితం నాటి ఓ మహిళా రోగి మృతి కేసులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని తమిళనాడు వినియోగదారుల కమిషన్ తేల్చింది. దీనికి గానూ బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 2005లో చెన్నైకు చెందిన దేవేంద్రం (38) అనే మహిళ ముక్కు దిబ్బడ, తలనొప్పి సమస్యలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వైద్యబృందం సలహా మేరకు ఎండోస్కోపీ నిర్వహించిన అనంతరం ఆమెను ఐసీయూకు తరలించారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ డెడ్ కావడంతోపాటు హృదయ సమస్యలు తలెత్తాయి. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చికిత్స విషయంలో ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె భర్త భోజయ్య ఆరోపించారు. ప్రాథమిక పరీక్షలు చేయలేదని, తక్కువ హిమోగ్లోబిన్, మధుమేహం సమస్యలను పట్టించుకోలేదని, అల్పాహారం తీసుకున్న వెంటనే అనస్థీషియా ఇచ్చారని ఆరోపిస్తూ.. ఆస్పత్రిపై కేసు దాఖలు చేశారు. సంబంధిత వైద్యులు కన్సల్టెంట్లు కాబట్టి వారిదే బాధ్యత అని ఆస్పత్రివర్గాలు వాదించాయి. తమ నిర్లక్ష్యం వల్ల కాదని, బ్రెయిన్ ట్యూమర్ వల్లే ఆమె మృతి చెందినట్లు చికిత్స చేసిన వైద్యులు పేర్కొన్నారు. అయితే, సరైన చికిత్స విధానాలు పాటించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమిషన్ గుర్తించింది. ఆమెకు వైద్యం చేసిన ముగ్గురు డాక్టర్లలో ఒకరు ఇప్పటికే మృతి చెందిన నేపథ్యంలో మిగతా ఇద్దరిని బాధ్యులుగా నిర్ధరించింది. మృతురాలి కుటుంబానికి ఎనిమిది వారాల్లోపు రూ.10 లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.50 వేలు అదనంగా చెల్లించాలని చెల్లించాలని ఆదేశించింది.
నిర్లక్ష్య వైద్యానికి రూ.10 లక్షల జరిమానా !
September 09, 2025
0
Tags