కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూర్చాయని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ''మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఐదేళ్లలో నమోదైన వారి కంటే ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ. మహారాష్ట్రలో లోక్‌సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది. అది దేశ సంపద. దానిని ఎందుకు చూపించట్లేదు'' అని రాహుల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు. మెషిన్ రీడ్ చేయగల ఓటరు లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. అటు కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లకు గాను లక్ష ఓట్లు నకిలీవి, తప్పుడు చిరునామావేనని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు.
అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయి !
August 07, 2025
0
Tags