బీహార్ లో మహిళా రోజ్‌గార్ యోజనను ప్రకటించిన సీఎం నితీష్ కుమార్

Telugu Lo Computer
0


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన'ను ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ తనకు నచ్చిన వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఈ ప్రతిపాదనకు బీహార్ మంత్రివర్గం శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది. మహిళలకు ఉపాధి కల్పించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించామని, వారు స్వయం ఉపాధితో జీవనం సాగించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని నితీష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎంపికైన మహిళలకు తమ పని ప్రారంభించేందుకు తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తారు. త్వరలోనే ఆసక్తి గల మహిళల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పథకం అమలును సమీక్షిస్తుంది. పట్టణాభివృద్ధి, హౌసింగ్ శాఖ అవసరమైన సాయాన్ని అందిస్తుంది. ఆర్థిక సాయం నేరుగా మహిళల బ్యాంకు అకౌంట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి జమ అవుతుంది. మహిళలు చేపట్టనున్న వెంచర్లను అంచనా వేసి దాని ఆధారంగా 2 లక్షల వరకూ అదనపు గ్రాంట్ మంజూరు చేసే అవకాశం కూడా ఉంది. అయితే పని ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మాత్రమే ఈ సమీక్ష ఉంటుంది. మహిళల ఉత్పత్తులకు స్పెషల్ మార్కెట్‌ప్లేస్‌లను కూడా డవలప్ చేస్తారు. ఈ పథకం కేవలం మహిళలను ఆర్థికంగా పటిష్టం చేయడమే కాకుండా, బీహార్‌లో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని నితీష్ కుమార్ తెలిపారు. ప్రజలు ఇంకెతమాత్రం ఉపాధి కోసం బయట రాష్ట్రాలకు వెళ్లనవసరం లేదని అన్నారు. తమ ప్రభుత్వం 2005 నుంచి మహిళా సాధికారత కోసం పాటుపడుతోందని, బిహార్ ప్రగతిలో మహిళల పాత్రకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ దిశగా ప్రస్తుత పథకం మరో మైలురాయి అని, ఇందువల్ల శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)