అమెరికా రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన భారత్ ?

Telugu Lo Computer
0


భారత్-అమెరికా మధ్య వాణిజ్య వార్ మొదలైంది. ట్రంప్ 50 శాతం సుంకాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఉన్న కీలక రక్షణ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజం బోయింగ్ నుండి ఆరు P-8I పోసిడాన్ యాంటీ-సబ్‌మెరైన్ విమానాలు భారతదేశం కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ డీల్ మొత్తం విలువ సుమారుగా రూ. 31,500 కోట్లు. ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలభారత చమురు దిగుమతులపై 50% దిగుమతి సుంకం విధిస్తూ చేసిన బెదిరింపులే దీనికి కారణమని తెలుస్తోంది. అమెరికా చర్యలను భారత్ అన్యాయమైనవిగా తెలిపింది. అమెరికా, యూరోపియన్ దేశాలు భారీగా రష్యా నుండి చమురు, ఎరువులు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని మండిపడింది. ద్వంద నీతికి అమెరికా పాల్పడుతోందని ఫైర్ అయింది. మీరు కొనుగోలు చేస్తే ఒప్పు..మేము కొనుగోలు చేస్తే తప్పు..ఇది అన్యాయాం కాదా అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదికలలో తెలిపింది. ఈ ఉద్రిక్త పరిణామాల మధ్య భారత ప్రభుత్వం అమెరికాకు షాకిస్తూ.. ఆగస్టు 3, 2025న P-8I విమానాల కొనుగోలు ఒప్పందాన్ని నిలిపివేసినట్లు రక్షణ నిపుణుల వెబ్‌సైట్ ఐడీఆర్ డబ్ల్యూ  వెల్లడించింది. P-8I పోసిడాన్ విమానాలు భారత నావికాదళానికి కీలకమైన నిఘా సామర్థ్యాన్ని అందించేవిగా చెప్పుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో చైనా సముద్ర శక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల ద్వారా సబ్‌మెరైన్లు, నౌకలు, వ్యాపార నౌకలు వంటి పలు అంశాలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.భారత నావికాదళం 12 P-8I విమానాలను ఇప్పటికే వినియోగిస్తోంది. 2009లో 8 విమానాలను, 2016లో మరో 4 విమానాలను అమెరికా నుండి కొనుగోలు చేసింది. అమెరికా 2021లో మరో 6 విమానాల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. అయితే ఖర్చు పెరిగి, ఒప్పందం ఆలస్యం కావడంతో ఆ లావాదేవీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ ఒప్పందం నిలిపివేతతో అమెరికన్ కంపెనీ బోయింగ్‌కు పెద్ద షాక్ తగిలినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లోనే దాదాపు 5 వేల ఉద్యోగాలు, రూ. 15 వేల కోట్ల మేర ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ ఒప్పందం నిలిపివేత కంపెనీ వ్యాపార లక్ష్యాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ స్వదేశీ సాంకేతికత వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. డీఆర్డీఓ, హెచ్ఏఎల్ సంస్థలతో కలిపి స్వదేశీ విమానాల అభివృద్ధి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)