సూరత్‌లోని డీకే అండ్‌ సన్స్‌ డైమండ్ కంపెనీలో రూ. 25 కోట్ల విలువైన వజ్రాల చోరీ

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని సూరత్‌, డీకే అండ్‌ సన్స్‌ డైమండ్ కంపెనీలో దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే వజ్రాలను దోచుకున్నారు. కంపెనీలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వజ్రాలను చోరీ చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం .. నగరంలోని కపోద్రా ప్రాంతంలో డీకే అండ్ సన్స్ డైమండ్ కంపెనీ ఆఫీస్ కమ్ పాలిషింగ్ యూనిట్‌లో ఆగస్టు 15 నుంచి 17 మధ్య ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు కూడా ధ్వంసం కావడం గమనార్హం. కంపెనీకి వరుసగా మూడురోజులు సెలవులు ప్రకటించడంతో ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది లేని సమయంలో ఈ వజ్రాల చోరీ జరిగినట్లు కంపెనీ పేర్కొంది. దీన్ని అవకాశంగా తీసుకున్న దుండగులు మొదటగా కంపెనీ కింది ఫ్లోర్‌లోని ప్రధాన డోర్‌ను బద్దలు కొట్టి ఆ తర్వాత మెటల్‌ సేఫ్‌ ఉంచిన మూడో ఫ్లోర్‌కి వెళ్లారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌తో సేఫ్‌ను కత్తిరించారు. కంపెనీ యూనిట్‌ యజమాని సెలవుల అనంతరం సోమవారం కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం తెలిసిందని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో దాదాపు రూ.25 కోట్లు విలువ చేసే వజ్రాలను దోచుకున్నట్లు అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)