అసెంబ్లీ సమావేశాల్లో ఫోన్‌లో 'రమ్మీ' ఆడిన మహారాష్ట్ర మంత్రి

Telugu Lo Computer
0


హారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావ్‌ కోకెట్‌ అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్‌లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ (శరద్‌పవార్‌ వర్గం) ఎమ్మెల్యే రోహిత్‌ పవార్‌ ఆరోపించారు. ఈమేరకు ఆయన ఎక్స్‌ వేదికగా దీనికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. అయినప్పటికీ వ్యవసాయ మంత్రి వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి మంత్రులున్న ప్రభుత్వం పంట బీమా, రుణ మాఫీ, మద్దతు ధరల కోసం రైతులు చేసే డిమాండ్‌లను ఏం వింటుందని విమర్శించారు. అప్పుడప్పుడు పేద రైతుల పొలాలను సందర్శించండి మహారాజా అంటూ కోకెట్‌పై.. రోహిత్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపిస్తున్నాయి. దీనిపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్‌ దూబే స్పందిస్తూ.. మంత్రి కోకెట్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఇప్పటివరకూ స్పందించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)