విమానాల ఇంధన స్విచ్‌ల్లో సమస్యలు లేవు : ఎయిర్‌ ఇండియా

Telugu Lo Computer
0


యిర్‌ ఇండియా వద్ద ఉన్న బోయింగ్‌ 787, 737 విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్‌ వ్యవస్థల్లో ఎటువంటి సమస్యలను గుర్తించలేదని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. లండన్‌ వెళ్లాల్సిన విమానం ఇంధన స్విచ్‌ల్లో సమస్య కారణంగా అహ్మదాబాద్‌లో కూలిపోయిన నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టింది. భారత్‌లో రిజిస్టర్‌ అయిన బోయింగ్‌ విమానాల్లో జులై చివరి నాటికి ఈ తనిఖీలను పూర్తి చేయాల్సి ఉంది. ''బోయింగ్‌ విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్‌ వ్యవస్థల్లో ముందు జాగ్రత్తగా చేపట్టిన తనిఖీలను ఎయిర్ ఇండియా పూర్తి చేసింది. వీటిల్లో ఎటువంటి సమస్యలను గుర్తించలేదు. మా తనిఖీలు జులై 12న మొదలై డీజీసీఏ సూచించిన వ్యవధిలో పూర్తి అయ్యాయి. ఈ విషయాన్ని నియంత్రణ సంస్థకు తెలియజేశాము'' అని ఎయిర్‌ ఇండియా పేర్కొంది. మరోవైపు ఎయిర్‌ ఇండియా ఏఐ171 విమాన ప్రమాద సమయంలో ఇంజిన్‌కు ఇంధనం నిలిచిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. వీటి కంట్రోల్‌ స్విచ్‌లు రన్‌ నుంచి కటాఫ్‌ పొజిషన్‌కు మారినట్లు పేర్కొన్నారు. ఇవి కేవలం సెకన్‌ వ్యవధిలో మారిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి పూర్తిగా పైలట్లే కారణమన్న రీతిలో పశ్చిమ దేశాల మీడియాలో వస్తున్న సమాచారాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తప్పుపట్టిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చింది. దాన్ని పరిశీలిస్తున్నాం. తుది నివేదిక వచ్చాకే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) పారదర్శకంగా దర్యాప్తు జరుపుతోంది. ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేయడం తగదు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపడతారు. అంతర్జాతీయ ప్రొటోకాల్‌కు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోంది'' అని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)