ధన్‌ఖడ్‌ రాజీనామాలో భాజపా కుట్ర ఉంది : రాష్ట్రీయ జనతాదళ్‌

Telugu Lo Computer
0


బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే మార్చేందుకు వీలుగా ధన్‌ఖడ్‌తో భాజపా రాజీనామా చేయించిందని ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌ ఆరోపించింది. నీతీశ్‌ను తప్పించి సొంత పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని భాజపా ఎదురు చూస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో వారిలో నిరాశ పెరిగిపోయిందని అసెంబ్లీలో ఆర్జేడీ చీఫ్‌ విప్‌ అక్తారుల్‌ ఇస్లాం షహిన్‌ పేర్కొన్నారు. ఆంగ్లవార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ ''చాలా కాలం క్రితం ఓ సీనియర్‌ భాజపా నాయకుడు నీతీశ్‌ను తప్పించే అంశానికి మద్దతుగా మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే మరో అడుగు ముందుకేసి నీతీశ్‌ను ఉప ప్రధాని చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ రాజీనామాలో భాజపా కుట్ర ఉందని తేలింది. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ అప్రాధాన్య పోస్టు ఇచ్చి నీతీశ్‌ను తప్పించాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలను ఆ రాష్ట్ర మంత్రి శ్రవణ్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ''నీతీశ్‌ కుమార్‌ బిహార్‌ను వీడే ప్రశ్నే లేదు. ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన ఎన్‌డీఏ కూటమిని విజయబాటలో నడిపించి రాష్ట్ర ప్రజలకు సేవ అందిస్తారు. మరోసారి సీఎంగా పాలిస్తారు'' అని తెలిపారు. నీతీశ్‌ సన్నిహిత వర్గంలో ఒకరిగా ఆయనకు పేరుంది. రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో బలంగా ఆయన పేరు వినిపిస్తోంది. చాలా కాలం క్రితం దివంగత భాజపా నేత సుశీల్‌ కుమార్‌ మోదీ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పదవి కోసం నీతీశ్‌ తీవ్రంగా ప్రయత్నించారని పేర్కొన్నారు. నాడు భాజపాకు లోక్‌సభలో మెజార్టీ ఉండటంతో ఆయన మాట చెల్లలేదు. దీంతో ఎన్‌డీఏను వీడారని ఆరోపించారు. 2022లో భాజపా-నీతీశ్‌ మధ్య విభేదాలు వచ్చాయి. నాడు తమ పార్టీని భాజపా ముక్కలు చేసేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్‌డీఏలోకి వచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)