బీహార్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, భాజపా నేత గోపాల్ ఖేమ్కా హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఆయన అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ఓ నిందితుడు పూలదండ తీసుకొని అంత్యక్రియలకు వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఖేమ్కా కుటుంబసభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, వ్యాపారవేత్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితుడు కూడా తనపై ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో పూలదండ తీసుకొని అంత్యక్రియలకు వచ్చాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడిని పట్నాకు చెందిన పున్‌పున్ ప్రాంత నివాసి రోషన్ కుమార్‌గా గుర్తించారు. హత్య కేసులో అతడి పాత్రపై పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. హత్యకు ముందు ఓ టీ దుకాణం వద్ద తాము కూర్చున్నామని అతడు తెలిపినట్లు పేర్కొన్నారు. గోపాల్ ఖేమ్కా హత్యకు ముందు ఇద్దరు వ్యక్తులు ఆయన కదలికలను ట్రాక్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఖేమ్కా బంకిపూర్ క్లబ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడే ఉన్న వ్యక్తి నిందితులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి గాంధీ మైదాన్ ప్రాంతంలోని బిస్కోమన్ టవర్ వద్ద ఉండి వ్యాపారవేత్త తన నివాసానికి వస్తున్నట్లు అప్రమత్తం చేశాడన్నారు. ఇతర నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. పాట్నాలో గాంధీ మైదాన్ ఠాణా పరిధిలోని రాంగులాం చౌక్ పనాష్ హోటల్ సమీపంలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్య రాష్ట్రంలో రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
అంత్యక్రియలకు వెళ్లి దొరికిపోయిన నిందితుడు
July 07, 2025
0
Tags