గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు మరో సమస్య ఎదురైంది. యుకేలో కనీసం రెండు కుటుంబాలకు చేరాల్సిన మృతదేహాలు మారిపోయినట్లు తేలింది. బాధితుల పక్షాన పనిచేస్తున్న న్యాయవాది ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మృతదేహాలు అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రి నుంచి సీల్ చేసిన శవపేటికల్లో యూకేకు తరలించారు. తాజాగా బాధితుల పక్షాన కేసును చూస్తున్న 'కీస్టోన్ లా' సంస్థకు చెందిన న్యాయవాది మాట్లాడుతూ ''మృతుల అవశేషాలను తప్పుగా గుర్తించి, వాటినే యూకేకు పంపించారు. అసహజ మరణాలను పరిశీలించే కరోనర్ ఆ మృతదేహాల అవశేషాలకు తిరిగి పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని కరోనర్ సదరు కుటుంబానికి తెలియజేయడంతో అంత్యక్రియలను వాయిదా వేసుకొంది. ఆ శవపేటికలోని మృతదేహం గుర్తు తెలియని వ్యక్తిది. వారి కుటుంబ సభ్యుడిది కాదు''అని వెల్లడించారు. మరో శవపేటికలో వేర్వేరు వ్యక్తుల అవశేషాలున్నాయని సదరు న్యాయవాది చెప్పారు. ''ఆ కుటుంబానికి ఇద్దరు వ్యక్తులకు చెందిన శరీర అవశేషాలను పంపించారు. వాటిని అంత్యక్రియలకు తీసుకెళ్లబోయే ముందు వేరు చేశారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం ప్రమాదానికి గురైంది. దీనిలో 241 మంది చనిపోయారు. వీరిలో 53మంది బ్రిటన్ వాసులు ఉన్నారు. చాలా మంది అంత్యక్రియలు భారత్‌లోనే ముగించారు. కేవలం 12 మంది మృతదేహాల అవశేషాలను మాత్రమే బ్రిటన్‌కు తరలించారు. వీటికి డీఎన్‌ఏ పరీక్షలకు అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో నిర్వహించారు. మృతుల బంధువులను ఇక్కడికే పిలిపించి వారి నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించారు. వారికి సాయం చేసేందుకు ఎయిర్ ఇండియా కెనైన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సంస్థను నియమించింది. తాజాగా ఈ అంశంపై బ్రిటన్ కుటుంబాలకు సాయం చేస్తున్న ఏవియేషన్ లాయర్ జేమ్స్ హేలీ ప్రాట్ మాట్లాడుతూ ''నేను ఆ బ్రిటిష్ కుటుంబాలతో నెలరోజులుగా ఉన్నాను. మొదట వారి ఆత్మీయుల మృతదేహాలను వెనక్కి తీసుకురావాలని కోరుకున్నారు. కానీ, వాటిల్లో కొన్ని మారిపోయాయి. వీటిని సరిచేయడానికి మరికొన్ని వారాలు పట్టొచ్చు'' అని పేర్కొన్నారు. ఇప్పుడు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసిన ప్రక్రియ నుంచి తిరిగి పరిశీలించడం మొదలుపెట్టారు. మరోవైపు, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిన వెంటనే యూకే వైపు నుంచి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నట్లు తెలిపింది. విమాన దుర్ఘటన తర్వాత అధికారులు ప్రోటోకాల్, సాంకేతిక పరిజ్ఞానంతో మృతదేహాల గుర్తింపు చేపట్టినట్లు స్పష్టం చేసింది. అన్ని మృతదేహాల గుర్తింపులో అత్యంత వృత్తి నైపుణ్యంతో, ఎంతో బాధ్యతతో వ్యవహరించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. అలాగే, ఈ అంశానికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు తాము యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
మృతదేహాలు మారిపోయాయని విమాన ప్రమాద బాధితుల ఆందోళన
July 23, 2025
0
Tags