అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన ఫెడరల్ రిజర్వ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు ఎదుర్కోబోయే సంక్షోభం గురించి ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఆందోళన వ్యక్తంచేశారు. ''వాయిస్ ప్రింట్‌ను ప్రామాణికంగా భావించే ఆర్థిక సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది నన్ను ఎంతగానో ఆందోళన కలిగిస్తోన్న అంశం. దీనికి కాలం చెల్లింది. ఏఐ దానిని చెల్లుబాటు కాకుండా చేస్తుంది'' అని అన్నారు. భద్రతా తనిఖీలను దాటవేసి, డబ్బును తరలించడానికి ఒక వ్యక్తి గళాన్ని అనుకరించే సామర్థ్యం ఏఐ టూల్స్ సొంతమని గుర్తు చేశారు. ఏఐ వాయిస్ క్లోన్లు, వీడియో క్లోన్లు అచ్చంగా నిజమైన వాటిలా అనిపిస్తాయి. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించడానికి అధునాతన పద్దతులు అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. దశాబ్దం క్రితం ఈ వాయిస్ ప్రింట్ ఎంతో ఆదరణ పొందింది. బ్యాంకులు సంపన్న వినియోదారుల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా వారు తమ అకౌంట్లను యాక్సెస్ చేసుకునే వీలుంది. కృత్రిమ మేధ గురించి గతంలోనూ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ''ఏఐ ఎలాంటి మాయ అయినా చేస్తుంది. అందుకే చాట్‌జీపీటీపై ప్రజలు విపరీతమైన విశ్వాసం చూపిస్తున్నారు. ఇది ఆసక్తికర విషయమే అయినా దీన్ని మీరు అంతగా నమ్మకూడదు. కృత్రిమ మేధ రంగంలో చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లు యూజర్ల అవసరాలను తీర్చేందుకు కొన్ని సార్లు వాస్తవాలతో రాజీపడి కల్పిత సమాచారాన్ని సృష్టిస్తుంటాయి. అసలు ఉనికిలోని లేని అంశానికి కూడా చక్కగా తప్పుడు సమాచారం ఇస్తుంటాయి'' అని వివరించారు. వాస్తవిక ప్రపంచంలోనే అసలైన శక్తి ఉంటుందన్నారు.
రాబోయే రోజుల్లో బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు ఎదుర్కోబోయే సంక్షోభం గురించి శామ్ ఆల్ట్‌మన్ ఆందోళన
July 23, 2025
0
Tags