తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో జరిగే మోసాలు అన్నీ ఇన్నీ కావు. టెక్నాలజీ సాయంతో అడ్డదారిలో తత్కాల్ టికెట్లు బుక్ చేసి, సామాన్యులకు టికెట్లు దొరక్కుండా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తత్కాల్ టికెట్లకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేసింది. దీన్ని కూడా బురిడీ కొటిస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్ అథంటికేషన్ ఉన్న ఐఆర్‌సీటీసీ ఐడీలనూ ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. తత్కాల్ టికెట్లకు సంబంధించిన టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపులను వేదికగా చేసుకుని కొన్ని ముఠాలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వం తత్కాల్ నియమాలు మార్చాక వీటి పనైపోతుందని భావించినప్పటికీ.. ఇప్పటికీ ఈ గ్రూపులు యాక్టివ్‌గానే ఉంటున్నాయి. ఏకంగా 'ఆధార్ వెరిఫైడ్ ఖాతాల' పేరిట ఆన్‌లైన్‌లో ఇవి కొత్త దందాకు తెరతీశాయి. ఒక్కో ఆధార్ ధ్రువీకరణ ఉన్న ఐఆర్‌సీటీసీ ఖాతాను రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ ఖాతాలను తత్కాల్ టికెట్ల కోసం ఓటీపీలను జనరేట్ చేయడానికి వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ ముఠాలు చేసే టికెట్ల బుకింగ్ కూడా మాన్యువల్‌గా ఏమీ జరగదు. వేగంగా టికెట్లు పూర్తి చేయడానికి బాట్స్ లేదా ఆటోమేటెడ్ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్లు వినియోగిస్తున్నారు. ఈ బాట్స్‌తో ఐఆర్‌సీటీసీ లాగిన్ వివరాలతో పాటు, ట్రైన్ వివరాలు, ప్రయాణికుల పేర్లు, పేమెంట్ వివరాలన్నీ క్షణాల్లో ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. ఈ రాకెట్ సూత్రధారులు ఏజెంట్లకు ఆ బాట్‌లను విక్రయిస్తుంటారు. ఒక్కో బాట్ ధర రూ.5 వేల వరకు ఉంటుంది. వాటి వినియోగం గురించీ వారే తర్ఫీదు ఇస్తారు. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో మొదటి ఐదు నిమిషాల్లో అయ్యే లాగిన్లలో 50 శాతం వరకు బాట్ ట్రాఫిక్ ఉంటోందని కేంద్ర రైల్వేశాఖే స్వయంగా చెప్పిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఏజెంట్లకు 30 నిమిషాల పాటు లాగిన్ అవ్వకుండా నిరోధించింది. అయితే, ప్రభుత్వం ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా వేర్వేరు రూపాల్లో తమ దందాను కొనసాగిస్తున్నాయనడానికి ఐఆర్‌సీటీసీ ఐడీల విక్రయమే తాజా ఉదాహరణ.
ఆధార్ అథంటికేషన్ ఉన్న ఐఆర్‌సీటీసీ ఐడీలనూ ఆన్‌లైన్‌లో విక్రయం !
July 04, 2025
0
Tags