ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ మహిళా క్రికెట్ జట్టు

Telugu Lo Computer
0


ఇంగ్లండ్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించి భారత్ మహిళా క్రికెట్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ ఇంగ్లండ్‌లో టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను గెలవడం ఇదే మొదటిసారి. భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టు ఇంగ్లాండ్‌పై 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో నాలుగో టీ20లో ఇంగ్లాండ్ జట్టుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. భారత బౌలర్ల దాటికి 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో సోఫియా డంక్లీ 22 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 వికెట్లు, శ్రీచరణి 2 వికెట్లు, అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(32), షఫాలీ వర్మ(31), జెమీమా రోడ్రిగ్స్(24*), హర్మన్ ప్రీత్ కౌర్(26) రాణించారు. ఈ మ్యాచ్ లో రాధా యాదవ్ కు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ లభించింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. భారత మహిళల జట్టు టీ20 సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టీమిండియా మొదటి, రెండో మ్యాచ్‌లలో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు పైచేయి సాధించింది. నాలుగో మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ జూలై 12, 2025న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)