కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బీ రకం యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. హిందూ మహాసముద్రం పై ప్రయాణిస్తున్న సమయంలో అందులో ఇంధనం తగ్గిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. ఐదో తరానికి చెందిన ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ యూకేకు చెందిన 'హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్' క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగం. ఇది ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోంది. ఇటీవల భారత నావికాదళంతో కలిసి యుద్ధ విన్యాసాలు కూడా చేసింది. ఎఫ్-35బీ జెట్ ఈ ప్రాంతంలో ల్యాండింగ్ కావడం అరుదైన ఘటనేగానీ అసాధారణం కాదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌పై ఇది ల్యాండింగ్ ఎందుకు చేయలేకపోయిందనే తెలియరాలేదు. కానీ, ఆ నౌక చుట్టుపక్కల వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి కారణమై ఉండొచ్చు. ఎఫ్-35బీ వేరియంట్ షార్ట్ టేకాఫ్ లేదా వర్టికల్ ల్యాండింగ్ కోసం రూపొందించారు. విమాన వాహక నౌకల పై పని చేసేందుకు వీలుగా ఉంటుంది. దీని స్టెల్త్ సామర్థ్యం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, డేటా షేరింగ్ మౌలిక సదుపాయాల కారణంగానే ఇది అమెరికా, యూకే, ఇజ్రాయెల్, నాటో వైమానిక దళాల్లో అత్యంత కీలకమైందిగా మారింది.
కేరళలో అత్యవసర ల్యాండైన బ్రిటీష్ యుద్ధ విమానం
June 15, 2025
0
Tags