మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యకు ప్రధాన సూత్రధారి అయిన జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్టు చేసినట్లు ముంబయి పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిఖీ హత్య కేసులో అరెస్టు చేసిన నిందితులను విచారించగా జీషాన్ అక్తర్ పేరు బయటకు వచ్చింది. ఈ హత్యకు ప్రణాళిక వేసింది జీషానే. హత్య జరిగిన తర్వాత నకిలీ పాస్‌పోర్టును వినియోగించి దేశం విడిచి పారిపోయాడు. ఇంటర్‌పోల్ ఇతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా అతడు కెనడాలో అరెస్టయ్యాడు. అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కాగా కేసు దర్యాప్తు సమయంలో నిందితుడు పాకిస్థాన్‌లో ఉన్నట్లుగా వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతడి ఆచూకీ తెలియకుండా అధికారుల దృష్టి మళ్లించేందుకు వీడియో రూపొందించినట్లు తెలుస్తోంది. జీషాన్ దేశం విడిచి ఎలా పారిపోయాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన జీషాన్ అసలు పేరు మొహమ్మద్ యాసిన్ అక్తర్. 2022లో పంజాబ్ పోలీసులు ఓ కేసులో అతడిని అరెస్టు చేశారు. కాగా ఇతడిపై పలు నేరారోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుల్లో జీషాన్ కూడా ఒకడు. విక్రమ్ బ్రార్ గ్యాంగ్‌లో కూడా ఇతడు సభ్యుడిగా ఉన్నాడనే అనుమానాలున్నాయి. గత అక్టోబరు 12న బాబా సిద్ధిఖీ ముంబయిలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు
బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్టు
June 11, 2025
0
Tags