భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంతోపాటు మారుతున్న సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడానికి కృషి చేస్తుంది. ఈ క్రమంలో భారతీయ రైల్వే రైల్వే మదద్ యాప్ ద్వారా ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ప్రయాణికుల కోసం రూపొందించిన ఒక అధికారిక మొబైల్ యాప్. ఇది ప్రయాణ సమయంలో ఫిర్యాదులు నమోదు చేయడానికి వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా నమోదు చేయవచ్చు. అలాగే రియల్ టైం లో ఫీడ్ బ్యాక్ ని కూడా తెలుసుకోవచ్చు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలను ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతోపాటు 24గంటలు రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139తో అనుసంధానం అయి ఉండడం వల్ల ప్రయాణికుల భద్రతకు కూడా ఈ యాప్ తో భరోసాను పొందవచ్చు. వినియోగదారులు ఈ యాప్ ను ఉపయోగించడం వల్ల స్నేహపూర్వకమైన ఇంటర్ఫేస్ తో పాటు వివిధ రకాల భాషల మద్దతును కూడా పొందవచ్చు. ఈ యాప్ ద్వారా రిజర్వేషన్లసమస్యలు, శుభ్రత తదితర సమస్యల పరిష్కారం సులభంగా చేసుకోవచ్చు. ఈ యాప్ ను యాపిల్ ఫోన్ ఉపయోగించేవారు ఐఓఎస్ యాప్ స్టోర్ నుండి, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉపయోగించేవారు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత వినియోగదారులు తమ వివరాలతో లాగిన్ చేసి, రైలు ప్రయాణ సమయంలో తమ సమస్యల వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆపై యాప్ ద్వారా ఫిర్యాదుకు ట్రాకింగ్ నెంబర్ ను ఉపయోగించి, చేసిన ఫిర్యాదు యొక్క స్థితిని దానిపైన అధికారులు తీసుకున్న చర్యను మనం ట్రాక్ చేసుకోవచ్చు.రైల్ మదద్ యాప్ 139 ఆల్ ఇన్ వన్ హెల్ప్ లైన్ నెంబర్ తో రైలు లోపల రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ పై ఇతర రైల్వే ప్రాంతాలలో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎటువంటి సహాయం కోసమైనా కాల్ చేసి మనకు కావలసిన సహాయాన్ని అర్ధించవచ్చు. ప్రయాణికులకు రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 పైన అవగాహన కల్పించడం కోసం అన్ని రైల్వే స్టేషన్లలో దీనిపైన ఇండియన్ రైల్వే అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కనుక రైల్వే అందిస్తున్న ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుకుంటున్నారు.
రైల్వే మదద్ యాప్ హెల్ప్ లైన్ నెంబర్ 139కు అనుసంధానం
June 15, 2025
0
Tags