పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియేపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మన దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో భద్రతా పరమైన సేవలందిస్తున్న తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఇదే అంశంపై పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు జమ్మూలో మాట్లాడుతూ జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది భద్రతాపరమైన అంశమని, సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇలా చెప్పిన కొన్ని గంటల్లోనే సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తుర్కియేకు చెందిన సెలెబి ఏవియేషన్.. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో భద్రతాపరమైన సేవలు అందిస్తోంది. 'సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ ఇండియా' పేరుతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 'సెలెబీ ఢిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్‌మెంట్ ఇండియా' మాత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కార్గో సేవలను అందిస్తోంది. అత్యంత కీలకమైన భద్రతా పనులను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. గ్రౌండ్‌లో విమానాలకు నిర్దేశం చేసే ర్యాంప్ సర్వీసులు, విమాన సమతుల్యతను నిర్ధరించే లోడ్ కంట్రోల్, ప్రయాణికుల బోర్డింగ్‌కు అవసరమైన బ్రిడ్జిలను అనుసంధానం చేయడం, కార్గో, పోస్టల్, గోదాముల నిర్వహణ వంటి కీలక వ్యవహారాలను నిర్వహిస్తోంది.
తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు
May 15, 2025
0
Tags