కర్ణాటకలోని కలబురగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ కార్యాలయం దగ్గర బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీజేపీ శాసనమండలి సభ్యుడు ఎన్.రవికుమార్ డిప్యూటీ కమిషనర్ ను ఉద్దేశించి మతతత్వ వ్యాఖ్యలు చేశారు. కలబురగి డిప్యూటీ కమిషనర్ పాకిస్తాన్ నుంచి వచ్చారా? లేదంటే ఇక్కడి ఐఏఎస్ అధికారియో తనకు తెలియదన్నారు. మీ చప్పట్లు చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ నిజంగానే పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ బీజేపీ నేత వ్యాఖ్యలు చాలా అసహ్యకరమైనవని తెలిపారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు నిజమైన భారతీయులేనా? అని సందేహం కలుగుతుందన్నారు. దీనిపై కలబురగి నివాసి ఒకరు బీజేపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో చేసిన దురుద్దేశపూరిత చర్యలు మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఐఏఎస్ అధికారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ నేత రవికుమార్ స్పందించారు. భావోద్వేగంతో అలా మాట్లాడానని, తమ పార్టీ బాధ్యతాయుతమైన కేంద్ర పాలక పార్టీ అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. తన వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారిని క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.
కలబురగి డిప్యూటీ కమిషనర్ పై బీజేపీ ఎంఎల్సీ మతతత్వ వ్యాఖ్యలు
May 27, 2025
0
Tags