బల్వీందర్ సింగ్ సాహ్నీకి దేశ బహిష్కరణ విధించిన దుబాయ్ క్రిమినల్ కోర్టు !

Telugu Lo Computer
0


భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీ భారీ స్థాయిలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు రుజువైన నేపథ్యంలో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా భారీ జరిమానా, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తు, శిక్షా కాలం అనంతరం యూఏఈ నుంచి బహిష్కరణకు కోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బల్వీందర్ సింగ్ సాహ్నీ 'రాజ్ సాహ్ని గ్రూప్' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని యూఏఈతో పాటు అమెరికా, భారత్ వంటి దేశాల్లో విస్తరించారు. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఫైవ్ స్టార్ హోటళ్లతో పాటు, లగ్జరీ అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు విలాసవంతమైన కార్లపై ప్రత్యేక మక్కువ ఉంది. 2016లో తన రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేక నంబర్ ప్లేట్ "D5" కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హమ్‌లు (సుమారు రూ. 75 కోట్లు) వెచ్చించడంతో హాట్ టాపిక్ అయ్యారు. సాహ్నీపై 2024లో కేసు నమోదైంది. షెల్ కంపెనీలు, ఫోర్జరీ చేసిన ఇన్‌వాయిసుల సాయంతో సుమారు 150 మిలియన్ దిర్హమ్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 340 కోట్లు) అక్రమంగా దేశం బయటకు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు సాహ్నీని, ఇతర నిందితులను దోషులుగా ప్రకటించింది. సాహ్నీకి ఐదేళ్ల జైలు శిక్ష, 5 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ. 1.14 కోట్లు) జరిమానా విధించింది. అంతేకాకుండా అక్రమ లావాదేవీల ద్వారా సంపాదించిన 150 మిలియన్ దిర్హమ్‌ల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో సాహ్నీ పెద్ద కుమారుడు కూడా శిక్ష పడినట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)