మిస్‌ వరల్డ్‌ పోటీల వ్యాపార లావాదేవీల విలువ రూ. 700 కోట్లు?

Telugu Lo Computer
0


హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ రూ.700 కోట్లపైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్‌ వరల్డ్‌ నిర్వహణ సంస్థకు రూ. 400-500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్‌షిప్‌ ఆదాయంలో మాత్రం 90 శాతానికిపైగా ఆదాయం మిస్‌ వరల్డ్‌ సంస్థకే చెందనుంది. మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణకు రూ. 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్‌షిప్స్‌ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని, కేవలం రూ. 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. ఈ లెక్కన స్పాన్సర్‌షిప్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల మేర సమకూరుతోందన్నది దాని సారాంశం. మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలను 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాటి ప్రసార హక్కుల కోసం పలు చానళ్లు ఇప్పటికే మిస్‌ వరల్డ్‌ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ రూపంలోనూ ఆ సంస్థకు భారీ మొత్తం సమకూరనుంది. అలాగే పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే టికెట్ల విక్రయాల రూపంలో సైతం ఆ సంస్థకు ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే ఒప్పందం మేరకు ఇందులో వాటా ఇస్తుంది. ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా కొన్ని డిజిటల్, సోషల్‌ మీడియా చానళ్లలోనూ మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అలాంటి సంస్థలకు కూడా హక్కులు విక్రయించడం ద్వారా మిస్‌ వరల్డ్‌ సంస్థ ఆదాయం పొందనుంది. యూట్యూబ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వాణిజ్య ప్రకటనల ప్రసారం ద్వారా కూడా ఆదాయంలో మిస్‌ వరల్డ్‌ సంస్థ వాటా పొందుతున్నట్లు సమాచారం. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు సంబంధించిన ఖర్చు వివరాలు మాత్రమే వెల్లడవుతుండగా ఆదాయ వివరాలను మాత్రం మిస్‌ వరల్డ్‌ సంస్థ గోప్యంగా ఉంచుతోంది. ఇతర అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా స్పాన్సర్‌షిప్స్‌ ఆదాయంపై కొంత స్పష్టత ఉంటున్నా అందాల పోటీల విషయంలో మాత్రం సంపూర్ణ గోప్యతే కొనసాగుతోంది. పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. 2023లో మిస్‌ వరల్డ్‌ పోటీలకు తొలుత యూఏఈని ఎంపిక చేశారు. ఆ సమయంలో పోటీల నిర్వహణ బడ్జెట్‌ను రూ. 250 కోట్లుగా అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో పోటీలు ముంబైకి మారాయి. ముంబైలో పోటీలకు చేసిన ఖర్చు, యూఏఈ అంచనాలో కేవలం 35 శాతంగా ఉన్నట్లు సమాచారం. రూ. 100 కోట్లలోపు ఖర్చుతోనే పోటీలను ముగించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. అయితే నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దీనికి అదనం. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్పాన్సర్‌షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిస్‌ వరల్డ్‌ సంస్థ చెల్లించనుందని సమాచారం. కానీ ఇందులో స్పష్టత లేదు. ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపచేస్తారు. గతేడాది ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్‌ రిపబ్లిక్‌ సుందరి క్రిస్టీనా పిజ్కోవాకు అందించిన కిరీటం విలువ రూ. 6.21 కోట్లని తెలుస్తోంది. ఈసారి విజేతకు ప్రైజ్‌మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)