ఏసీ వినియోగిస్తున్న ప్రజలకు, వ్యాపార సంస్థలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో ఒక విజ్ఞప్తి చేసింది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు హైదరాబాదుతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లోని ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ డీఫాల్ట్ సెట్టింగ్‌లో ఉంచాలని కోరుతుంది. ఎయిర్ కండిషనర్లను డీఫాల్ట్ గా 24 డిగ్రీల సెల్సియస్‌కు పెంచితే, సంవత్సరానికి సుమారు రూ.4,000 వరకు విద్యుత్ బిల్లులో పొదుపు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. అదే ఉష్ణోగ్రతను 27 డిగ్రీల వరకు పెంచితే ఏడాది విద్యుత్ బిల్లు రూ.6,500 వరకూ తగ్గించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం కూడా తక్కువ అవుతుందని వెల్లడిస్తుంది. 90 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాదును, పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగిన విద్యుత్ సదుపాయాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, తక్కువ ఖర్చుతో ఏసీ వాడకాన్ని ప్రోత్సహించే ప్రధాన నగరంగా బీఈఈ గుర్తించింది. బీఈఈ కార్యదర్శి మిలింద్ దేవొరే మాట్లాడుతూ ట్రాన్స్ కో, ఎస్డీఏ హైదరాబాదులోని ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, ప్రభుత్వ భవనాలలో ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. రోజుకి 8-10 గంటలు పనిచేసే ఒక్క ఏసీ యూనిట్ దాదాపు 10 కిలోల CO₂ వాయువు ఉద్గరిస్తుందని పేర్కొన్నారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే 18-21 డిగ్రీల ఉష్ణోగ్రతల్ని 24 డిగ్రీలకు పెంచితే సుమారు 24 శాతం వరకు విద్యుత్ పొదుపు సాధ్యమవుతుంది. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఇదివరకే ఏసీల వినియోగంపై నియంత్రణలు అమలులో ఉన్నాయి. జపాన్‌లో ఎయిర్ కండిషనర్లకు 28 డిగ్రీల డీఫాల్ట్ సెట్టింగ్‌ను అమలు చేశారు. అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో 26 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతను అనుమతించడంలేదు. ఈ విధంగా తీసుకునే చర్యల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ (రూ.10,000 కోట్ల విలువైన) పొదుపు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇది సంవత్సరానికి సుమారు 8.2 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుకు సమానం అని చెబుతున్నారు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల మధ్య ఉంటుంది. అందువల్ల 24 డిగ్రీలు ఆరోగ్యపరంగా కూడా మానవ శరీరానికి అనుకూలంగా ఉంటుంది. మన దేశం లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది సౌకర్యాన్ని కలిగించే ఉష్ణోగ్రతగా పరిగణించబడుతుందని వివరిస్తున్నారు. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో భారీ విద్యుత్ పొదుపు సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఏసీలను 24 డిగ్రీల్లో పెట్టాలని ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో విజ్ఞప్తి !
May 05, 2025
0
Tags