యూట్యూబర్‌ రణవీర్‌ పాస్‌పోర్ట్‌ రిలీజ్‌కు నిరాకరించిన సుప్రీం కోర్టు !

Telugu Lo Computer
0


'ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ షోలో అసభ్యకర వ్యాఖ్యల విషయంలో యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా దర్యాప్తును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి పాస్‌పోర్ట్‌ను రిలీజ్‌ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసులో దర్యాప్తు ముగిసిన తర్వాత పాస్‌పోస్ట్‌ రిలీజ్‌ చేయాలనే పిటిషన్‌ను పరిశీలిస్తామని వెల్లడించింది. ముంబయి, గువాహటి, జైపుర్‌లలో అతడిపై నమోదైన కేసులపై అరెస్ట్‌ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. పోలీసులకు తన పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలని కోర్టు గతంలో చేసిన ఆదేశాలను సవరించాలని కోరుతూ అల్హాబాదియా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇకపై తన షోలలో అమర్యాదకర వ్యాఖ్యలు చేయనని.. బాధ్యతగా నడుచుకుంటానని హామీ ఇచ్చారు. పాస్‌పోర్ట్‌ లేకపోవడం వల్ల తాను విదేశాలకు వెళ్లలేకపోతున్నానని..దీని వల్ల తన జీవనోపాధి ప్రభావితం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియా అతని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అత్యున్నత న్యాయస్థానం అల్హాబాదియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణ్‌వీర్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదని స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి షోలు చేయవద్దని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)