తమిళనాడు లోని నాగపట్నంలో జరిగిన డిఎంకె జిల్లా కార్యదర్శి వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ 'కేంద్రం డిలిమిటేషన్‌ను విధానాన్ని అమలు చేయాలని చూస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో మేము కూడా కుటుంబ నియంత్రణపై దృష్టిపెట్టాము. నేను అంతకుముందు కొత్తగా పెళ్లైన వారు కుటుంబాన్ని ప్లాన్ చేసుకునేముందు సమయం తీసుకోవాలని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు వెంటనే పిల్లల్ని కనమని, వారికి మంచి తమిళ పేరు పెట్టమని నూతన జంటల్ని కోరుతున్నాను' అని స్టాలిన్ అన్నారు. కాగా, కేంద్రం అమలు చేయబోతున్న డిలిమిటేషన్‌ను తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలను విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని స్టాలిన్ ఎప్పటినుంచో వాదిస్తున్నారు. డిలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకే ఉపయోగం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో సరైన ప్రాతినిధ్యం లభించదని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే స్టాలిన్ తీరుపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ తీవ్రంగా తప్పుపట్టారు. డిఎంకె పార్టీ దుష్పరిపాలన నుంచి దృష్టి మళ్లించడానికే స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో డిలిమిటేషన్‌పై మార్చి 5వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
వెంటనే పిల్లల్ని కనమని, వారికి మంచి తమిళ పేరు పెట్టమని నూతన జంటల్ని కోరుతున్నా : ఎం.కె. స్టాలిన్
March 03, 2025
0
Tags