మధుమేహం, ఊబకాయానికి 'మౌంజారో' ఇంజెక్షన్‌ !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లోకి ఎలీ లిల్లీ ఇండియా సంస్థ ఉబకాయం, మధుమేహానికి పనిచేసే 'మౌంజారో' అనే ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) అనుమతితో సింగిల్‌ డోస్‌ వయల్‌ రూపంలో ఈ ఇంజెక్షన్‌ను విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీన్ని వైద్యులు సిఫారసు చేసిన మోతాదు ప్రకారం వారానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే టిర్జెపటైడ్‌ అనే ఔషధం.. మన శరీరంలో ఉండే జీఐపీ (గ్లూకోజ్‌ డిపెండెంట్‌ ఇన్సులినోట్రోపిక్‌ పాలీపెప్టైడ్‌), జీఎల్‌పీ-1 (గ్లూకోగాన్‌ లైక్‌ పెప్టైడ్‌-1) అనే హార్మోన్‌ గ్రాహకాలను ఉత్తేజితం చేస్తుందని, తద్వారా మధుమేహం, ఊబకాయం, అధికబరువును అదుపులో ఉంచుతుందని కంపెనీ తన ప్రకటనలో వివరించింది. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ఆహార నియంత్రణ పాటిస్తూ, వ్యాయామం చేస్తూ ఈ ఔషధాన్ని వారానికి 15 మిల్లీగ్రాముల చొప్పున తీసుకున్నవారు 72 వారాల వ్యవధిలో సగటున 21.8 కిలోల బరువు తగ్గారని.. 5ఎంజీ చొప్పున తీసుకున్నవారు సగటున 15.4 కిలోల బరువు తగ్గారని వెల్లడించింది. మన దేశంలో ఈ ఔషధం ధర 2.5 మిల్లీగ్రాముల వయల్‌ రూ.3,500. అదే 5 మిల్లీ గ్రాముల వయల్‌ అయితే రూ.4,375. వైద్యులు సిఫారసు చేసిన మోతాదును బట్టి ఖర్చు ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)