గాజా వాసులకు మానవతా సాయం సరఫరా నిరంతరం కొనసాగాలని భారత్ పిలుపునిచ్చింది. ''గాజాలో నెలకొన్న పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి ప్రజలకు నిరంతరం మానవతా సాయం కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిచిపెట్టడం ముఖ్యం'' అని పిలుపునిచ్చింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతుంటే మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయినట్లు తెలిపింది. గాజా ఆస్పత్రుల్లో ఎటు చూసిన భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి. చిన్నారుల ఐసీయూలు నిండిపోయాయని అక్కడి వైద్యులను ఉటంకిస్తూ మీడియా కథనాలు ప్రచురించింది. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులతో.. గాజా వాసులకు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మానవతా సాయం సరిగా అందడం లేదు. దీంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన భారత్.. మానవతా సాయం నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చింది.
గాజాకు మానవతా సాయం నిలిపివేతపై భారత్ ఆందోళన !
March 19, 2025
0
Tags