అమెరికా స్టాక్ మార్కెట్లలో 4 ట్రిలియన్‌ డాలర్ల సంపద ఆవిరి !

Telugu Lo Computer
0


మెరికా స్టాక్ మార్కెట్లు దాదాపు 20 రోజుల వ్యవధిలోనే భారీగా పతనం అయ్యాయి. స్టాక్స్‌లోని మదుపర్ల సంపద 4 ట్రిలియన్‌ డాలర్ల (రూ.349 లక్షల కోట్లు) మేరకు ఆవిరైపోయింది. ఇది యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌ షట్‌డౌన్‌ భయాలు సూచీలను వెంటాడుతున్నాయి. దీనికి ట్రంప్‌ అస్థిర విధానాలు తోడయ్యాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఫిబ్రవరి 19వ తేదీన నమోదు చేసిన ఆల్‌టైమ్‌ హై నుంచి ఇప్పటికి 8 శాతానికిపైగా విలువ కోల్పోయింది. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ డిసెంబర్‌లో నమోదుచేసిన అత్యధిక విలువ నుంచి 10శాతం పతనమైంది. ఇక ఒక్క సోమవారమే 1.7 ట్రిలియన్‌ డాలర్ల సంపద కరిగిపోయింది. 2022 సెప్టెంబర్‌ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇక మస్క్‌ నేతృత్వంలోని టెస్లా షేర్‌ ధర 15శాతం పతనం కావడం గమనార్హం. డిసెంబర్‌ 17 నుంచి ఈ సంస్థ షేరు విలువ 50శాతం ఆవిరైంది. నాడు అత్యధికంగా 479.86 డాలర్లు ఉండగా, నేడు అది 222.15 డాలర్లకు చేరింది. వివిధ కారణాలు కలిసి ఓ ప్యాకేజీలా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య విధానాల్లో హఠాత్తుగా వస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం భయాలు, స్టాక్స్‌ అధిక విలువలు వంటివి కారణమవుతున్నాయని లాజర్డ్‌ సీఈవో పీటర్‌ ఓర్స్‌జాగ్‌ వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాన వాణిజ్య భాగస్వాములైన కెనడా, మెక్సికో, ఐరోపాతో వాణిజ్య యుద్ధాల వల్ల చాలా కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను పునఃపరిశీలిస్తున్నాయన్నారు. అమెరికాలోని భారీ సంపన్నులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. అక్కడి మార్కెట్లలో 50 శాతం విలువైన సంపద 1శాతం మంది వద్ద ఉంటుంది. ఇక 37శాతం విలువైన సంపద 10శాతం మంది వద్ద ఉంటుంది. 12శాతం వాటా 40శాతం మంది వద్ద కేంద్రీకృతమైంది. మిగిలిన 1శాతం వాటా 50శాతం మంది ప్రజల చేతిలో ఉందని ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయీస్‌ డేటా పేర్కొంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉందని ఓ టీవీ షోలో అభివర్ణించారు. అదే సమయంలో ఆర్థిక మాంద్యం రాదని కచ్చితంగా చెప్పలేదు. యాంకర్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను అలాంటి విషయాలను ఊహించడాన్ని కూడా ఇష్టపడనని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం చాలా పెద్దపని చేపట్టిందని.. ఈ క్రమంలో మార్పు దశ ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ పతనానికి, ఆర్థిక మాంద్యానికి ట్రంప్‌ సర్కారు సిద్ధమైందనే సంకేతాలున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్‌మన్‌ శాక్స్ కూడా అమెరికాలో వచ్చే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం వచ్చేందుకు 15-20శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఓ వైపు మారెట్లు పతనం అవుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని శ్వేతసౌధంలోని ది నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌ అధిపతి కెవిన్‌ హస్సెట్ట్‌ చెప్పారు. ఆర్థిక మాంద్యం భయాలను తోసిపుచ్చారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పేందుకు పలు కారణాలున్నాయన్నారు. ఇక సుంకాల విషయంలోని అస్పష్టత త్వరలోనే తొలగిపోతుందన్నారు. ఇక పన్ను కోతలు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)