బంగ్లాదేశ్ భారత్‌కు దూరం జరుగుతూ పాకిస్థాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. 1971లో పాక్, బంగ్లాదేశ్‌లు విడిపోయిన తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యాన్ని పునఃప్రారంభించాయి. ప్రభుత్వం ఆమోదించిన మొదటి కార్గో కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి ఢాకాకు బయలుదేరినట్లు పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ప్రారంభంలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో ఈ ఒప్పందం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ''1971 తర్వాత మొదటిసారిగా పాకిస్థాన్ నేషనల్ షిప్పింగ్ కార్పోరేషన్ నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు తమ ప్రభుత్వ సరుకును తీసుకెళ్తోంది. ఇది ఇరుదేశాల మధ్య సముద్ర వాణిజ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది'' అని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. ఈ రవాణా రెండు దశల్లో పూర్తవుతుందని, ప్రస్తుతం 25వేల టన్నుల బియ్యం తరలించారని వెల్లడించింది. మరో 25,000 టన్నుల బియ్యం మార్చి ప్రారంభంలో పంపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో 53 ఏళ్లలో తొలిసారి పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలికార్గో షిప్ వచ్చినట్లు అప్పట్లో స్థానిక మీడియా కథనాలు వెలువడ్డాయి. పనామా జెండాతో ఉన్న ఆ నౌక 811 కంటైనర్లలో సోడాయాష్, మార్బుల్ బ్లాక్, ముడివస్త్రాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి వాటిని మోసుకొచ్చిందని వార్తా సంస్థలు వెల్లడించాయి. 1971లో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నాటి నుంచి ఇరుదేశాల మధ్య ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఇన్నేళ్ల అనంతరం ఇరుదేశాల మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య ఒప్పందాలు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతం చేస్తూ ప్రత్యక్ష రవాణా మార్గాలను సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది.
బలోపేతమవుతున్న పాక్-బంగ్లా మధ్య ప్రత్యక్ష వాణిజ్యం !
February 23, 2025
0
Tags