ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేష్ వర్మ ?

Telugu Lo Computer
0


ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, 10 రోజులు పూర్తయినా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఇప్పటికీ కమలం స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి, 20వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని సమాచారం. ఇదివరకు సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళ లేదా రేపట్లో ఉంటుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, తాజా పరిణామాల ప్రకారం ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీని గట్టి దెబ్బకొట్టిన ఆయనకు పగ్గాలు  అప్పగించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్‌లో ఉంది. అయితే రేఖ గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్‌దేవా, బన్సూరి స్వరాజ్, హరీష్ ఖురానా తదితర నేతల పేర్లు కూడా రేసులో ఉన్నాయి. బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకు చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రజలు కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే ఉత్కంఠలో ఉన్నారు. అధిష్ఠానం తుది నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అధికారాన్ని దక్కించుకోవడంతో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కొత్త సీఎం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం 70  అసెంబ్లీ సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది.




Post a Comment

0Comments

Post a Comment (0)