యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించిన వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియోను యూట్యూబ్ తొలగించింది. సమాచార, మంత్రిత్వశాఖ నుంచి ఆ సంస్థకు నోటీసులు అందడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తాను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. 'కామెడీ కంటెంట్ పేరుతో భాషా పరిమితులు దాటడం ఆమోదయోగ్యం కాదు. ఒక ఫ్లాట్‌ఫామ్‌లో మీకు అవకాశం వచ్చిందంటే.. అక్కడ ఏదైనా మట్లాడవచ్చని కాదు. రణవీర్‌కు అనేకమంది ఫాలోవర్లు ఉన్నారు. అనేకమంది రాజకీయ నాయకులు అతడి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా' అని ఎంపీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. 'ఇండియాస్ గాట్ లాటెంట్' షోలో ఇన్‌ఫ్లుయెన్సర్ రణవీర్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అయ్యింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సహా ప్రతిపక్షాలు కూడా అతడిపై విమర్శలు గుప్పించారు. వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగపరిచాడంటూ ఫడణవీస్ మండిపడ్డారు. ఈనేపథ్యంలో తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రణవీర్ ఓ వీడియోను విడుదల చేశారు. మరోవైపు రణవీర్‌పై పలువురు నేతలు సైతం కేసులు పెట్టారు.
రణవీర్ అల్హాబాదియా వీడియోను తొలగించిన యూట్యూబ్ !
February 11, 2025
0
Tags