అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా ఐదో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవన్న ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1200 పాయింట్ల మేర నష్టపోగా, నిఫ్టీ 23వేల దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,384.98 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ట్రేడయిన సెన్సెక్స్, మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 76,030.59 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,986.65 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు మేర బలపడి 86.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క భారతీ ఎయిర్‌టెల్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరై రూ.408 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2932 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 1000 పాయింట్లు ఢమాల్ !
February 11, 2025
0
Tags