దేశీయ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో వివో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో వున్న శాంసంగ్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఈ మేరకు 2024 సంవత్సరానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. గడిచిన ఏడాదిలో దేశీయంగా శాంసంగ్ తన మార్కెట్ వాటాను దాదాపు 4 శాతం కోల్పోయిందని ఐడీసీ నివేదిక వెల్లడించింది. 2024లో శాంసంగ్ మార్కెట్ వాటా 17 శాతం నుంచి 13.2 శాతానికి తగ్గిందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది కాలంలో మొబైల్ సరఫరాలు 19.4 శాతం తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. అదే సమయంలో ఐఫోన్ తయారీదారైన యాపిల్ క్రమంగా మార్కెట్ వాటాను పెంచుకుంది. గతంలో 6.4 శాతంగా ఉన్న ఆ కంపెనీ మార్కెట్ వాటా 8.2 శాతానికి చేరింది. మోటోరొలా 2.7 శాతంగా ఉన్న తన మార్కెట్ వాటాను 6 శాతానికి పెంచుకోగలిగింది. ఒకప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌లో దూసుకెళ్లిన వన్‌ప్లస్ మార్కెట్ వాటా 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పడిపోయింది. ఇదే కాలానికి రియల్‌మీ వాటా 12.5 శాతం నుంచి 11 శాతానికి, షావోమీ 12.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గాయి. 2024లో భారత్ మొత్తంగా 151 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్ల సరఫరా జరిగినట్లు ఐడీసీ తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరిగింది. గతేడాదిలో అమెరికా, చైనా, జపాన్ తర్వాత యాపిల్‌కు నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. షిప్‌మెంట్లు రికార్డు స్థాయిలో 12 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి నమోదు చేసిందని నివేదిక తెలిపింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ 10 శాతం వాటాతో టాప్- 5 సంస్థల్లో ఒకటిగా నిలవడం గమనార్హం. ఐఫోన్ 15, ఐఫోన్ 13 విక్రయాలు ఇందుకు దోహదం చేసినట్లు ఐడీసీ నివేదిక తెలిపింది.
శాంసంగ్‌ను వెనక్కి నెట్టిన అగ్రస్థానాన్నిఆక్రమించిన వివో
February 11, 2025
0
Tags