భారతీయ రైల్వేలో దేశవ్యాప్తంగా 7,308 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ వందలాది రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఆదాయం ప్రధానంగా దుకాణాలు, ప్రకటనలు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, క్లాక్ రూమ్‌లు, వెయిటింగ్ హాళ్లు వంటి వనరుల నుంచి వస్తుంది. దీంతో రైల్వే స్టేషన్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయల ఆదాయం భారతీయ రైల్వేకు వస్తోంది. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే స్టేషన్ దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. రైల్వేలు విడుదల చేసిన డేటా ప్రకారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఆర్జించింది. ఆ క్రమంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రైల్వేకు రూ. 3337 కోట్ల ఆదాయం వచ్చింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే స్టేషన్ మాత్రమే కాదు, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 39,362,272 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించారు. స్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయమే రైల్వేలకు ప్రధాన ఆదాయ వనరు. ఆదాయంలో హౌరా రైల్వే స్టేషన్ రెండో స్థానంలో ఉంది. ఈ స్టేషన్ వార్షిక ఆదాయం రూ.1692 కోట్లు. హౌరా రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 61,329,319 మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి. ఆదాయం పరంగా చెన్నై సెంట్రల్ మూడో స్థానంలో ఉంది. దక్షిణ భారత దేశంలోని ఈ రైల్వే స్టేషన్ ఒక్క ఏడాదిలో రూ.1299 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో 30,599,837 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్లు నాన్-సబర్బన్ గ్రూప్-I కేటగిరీ కింద చేర్చబడ్డాయి. ఈ జాబితాలో 28 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఇది రూ. 1276 కోట్లను ఆర్జించింది. ఇక్కడి నుంచి 27,776,937 రైల్వే ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు. ఢిల్లీలోని మరో రైల్వే స్టేషన్ టాప్ 5లో నిలిచింది. ఢిల్లీలోని హర్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ర్యాంకింగ్‌లో ఐదో స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1227 కోట్లు ఆర్జించింది. ఇక్కడి నుంచి 14,537,687 మంది ప్రయాణికులు రాకపోకలు జరిపారు.
అత్యధిక ఆదాయం ఆర్జించే రైల్వే స్టేషన్ గా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ !
January 10, 2025
0
Tags