పెద్దపేగు క్యాన్సర్‌ - లక్షణాలు !

Telugu Lo Computer
0


పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలను కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డాక్టర్ జో విట్టింగ్టన్ వివరించారు. మలంలో రక్తం కనిపించడం పెద్దపేగు క్యాన్సర్ లక్షణం. పేగులో పెరుగుతున్న కణితి నుంచి రక్తస్రావం అవుతూ, అది మలంలో కనిపిస్తుంది. మలం గతంలో కంటే చాలా పల్చగా వస్తుంటే, అది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు. పేగులో కణితి లేదా గడ్డ ఏర్పడటం వల్ల మలం వెళ్లే దారికి అడ్డుపడవచ్చు. దాంతో మలం సన్నగా రావొచ్చు. కేవలం ఆకారం మాత్రమే కాదు, పరిమాణం కూడా ముఖ్యమే. మలవిసర్జన పూర్తిగా జరగనట్లు అనిపించడం, టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా కడుపు పూర్తిగా ఖాళీ కాలేదనిపిస్తే, అనుమానించాలి. ఈ లక్షణం మలబద్ధకంలా అనిపించవచ్చు, కానీ ఇది పెద్దపేగు క్యాన్సర్‌కు ముఖ్యమైన సంకేతం కావచ్చు. వెన్ను నొప్పి సాధారణంగా శారీరక శ్రమ లేదా వయసు మీద పడినప్పుడు వస్తుంది. కానీ, ఒక్కోసారి ఇది పెద్దపేగు క్యాన్సర్‌కు కూడా సంకేతం కావొచ్చు. పేగులో ఏర్పడిన కణితి చుట్టుపక్కల కణజాలం లేదా నరాలపై ఒత్తిడి తెస్తుంది. ఫలితంగా వెన్ను నొప్పి వస్తుంది. ఒకవేళ క్యాన్సర్ వెన్నెముక లేదా కటి భాగాలకు వ్యాపిస్తే, నొప్పి మరింత తీవ్రమవుతుంది. ఎలాంటి కారణం లేకుండానే బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. పెద్దపేగులో ఏర్పడిన కణితి పోషకాల శోషణపై ప్రభావం చూపుతుంది. లేదా మెటబాలిజంలో మార్పులు కలిగిస్తుంది. దాంతో, అకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఏ క్యాన్సర్ వచ్చినా సరే కారణం లేకుండా అలసటగా అనిపిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారిలో అలసట రావడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, రక్తస్రావం చేసే కణతులు ఉండటంతో శరీరం రక్తాన్ని కోల్పోతుంది. రెండు క్యాన్సర్‌తో పోరాడేందుకు శరీర రోగనిరోధక వ్యవస్థ పోరాడుతుంది, దీని ఫలితంగా కూడా అలసట వస్తుంది. ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తుంటే వైద్యుల సలహాతో టెస్టులు చేయించుకోవాలి. కడుపులో నొప్పి, అది కూడా నెమ్మదిగా తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటే అది పెద్దపేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు. పేగుల్లో కణితి ఏర్పడితే వికారం, వాంతులు కూడా ఇబ్బంది పెట్టొచ్చు, ఇది ముదిరితే జ్వరం కూడా వస్తుంది, ఎందుకంటే పేగుల్లో చీము చేరే అవకాశం ఉంది. ఒకవేళ ట్యూమర్ ఊపిరితిత్తులకు పాకితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, మెదడుకు చేరితే నాడీ సంబంధిత సమస్యలు, ఎముకలకు పాకితే భరించలేని నొప్పి, ఒక్కోసారి ఎముకలు విరిగేలా కూడా చేయొచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)