స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ !

Telugu Lo Computer
0


వచ్చే ముంబై, నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన ఒంటరిగా పోటీ చేస్తోందని శివసేన సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదని, మేం సింగల్ ‎గానే పోరాడుతామని, ఏం జరిగినా చూసుకుంటామని అన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా పార్టీ కార్యకర్తలకు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాదని, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పొత్తు పెట్టుకుంటే కార్యకర్తలకు సరైన అవకాశాలు రావని, ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగి పార్టీని బలోపేతం చేసుకుంటామని పేర్కొన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత కూటమి ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని, ఇది మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమిలో అతిపెద్ద పార్టీగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ బాధ్యత అని అన్నారు. కాగా, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. శివసేన యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా చేరి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా అద్భుత ఫలితాలు సాధించింది. అధికార బీజేపీని తక్కువ స్థానాలకు పరిమితం చేసి మెజార్టీ సీట్లు ఇండియా కూటమి దక్కించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)