ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపై భాజపా సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాలుగేళ్లుగా ఢిల్లీ సమస్యలను పట్టించుకోని ఆతిశీ, ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగర వ్యాప్తంగా జింకలా పరుగెడుతున్నారని అన్నారు. ''ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర వీధుల పరిస్థితి చూడండి. గడిచిన నాలుగేళ్లలో ఆతిశీ ఎప్పుడూ ఈ సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారు'' అని రమేశ్ బిధూడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆతిశీ ఇంటిపేరు మార్చుకుందని గతవారం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, రాజకీయ ప్రత్యర్థులపై వివాదాస్పద ప్రకటనలు చేయడం బిధూడీకి ఇదేం మొదటిసారి కాదు. బీఎస్పీ నేత డానిష్ అలీని దూషించడం మొదలు.. ప్రియాంకా గాంధీ వంటి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఆతిశీపై మరోసారి నోరుజారిన బిధూడీ !
January 15, 2025
0
Tags