బీహార్‌ కులగణనను రాహుల్‌ గాంధీ నకిలీగా పేర్కొనడంపై ఎన్డీయే ఆగ్రహం !

Telugu Lo Computer
0


బీహార్‌లో నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం గతంలో చేపట్టిన కులగణనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నకిలీగా పేర్కొనడంపై ఎన్డీయే మండిపడింది. మొన్నటివరకు బీహార్‌ కుల సర్వేను ప్రశంసించిన ఆయన, ఇప్పుడు దాన్ని నకిలీగా పేర్కొనడం విస్మయకరమని పేర్కొంది. నీతీశ్‌ కుమార్ గతంలో 'ఇండియా' కూటమి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు రాహుల్‌ మౌనంగా ఉన్నారని ఆరోపించింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కులగణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత శనివారం తొలిసారి బీహార్‌లో పర్యటించిన సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించి.. 2022-23లో బిహార్‌లో స్థానిక ప్రభుత్వం నిర్వహించిన విధంగా ఈ ప్రక్రియ నకిలీది కాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరులో కులగణన వివరాలు వెల్లడైన సమయంలో కాంగ్రెస్ సైతం నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం గమనార్హం. రాష్ట్రంలో దళితులు, వెనుకబడిన తరగతుల జనాభా శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. రాహుల్‌ వ్యాఖ్యలపై జేడీయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ ఝా స్పందిస్తూ ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. భారత ప్రభుత్వానికి, దేశానికి మధ్య తేడాను గుర్తించలేని నేత నుంచి ఇంతకంటే మరేం ఆశించగలమని మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కులగణనకు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. సర్వేలోని లోపాలను స్పష్టమైన ఆధారాలతో ఎత్తి చూపితే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ విమర్శలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. సర్వే అంశాలను అటకెక్కించారనే విషయాన్ని రాహుల్‌ చాటిచెప్పాలనుకున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్‌ ప్రసాద్ సింగ్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)