మణిపూర్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన కన్నూర్‌ యూనివర్సీటీ !

Telugu Lo Computer
0


ణిపూర్‌లో ఘర్షణల వల్ల ఎంతో మంది విద్యకు దూరమైపోయారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి చెందిన కన్నూర్‌ యూనివర్సీటీ మణిపూర్‌ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. అండర్‌ గ్రాడుయేట్‌, పోస్ట్ గ్రాడుయేట్ చదవాలనే ఆకాంక్షతో ఉన్న మణిపూర్‌ విద్యార్థులు తమను సంప్రదించాలని విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్ తెలిపారు. మణిపూర్‌ విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ అంశంపై యూనివర్సిటీ సిబ్బందితో చర్చించిన తరువాత ఏకాభిప్రాయానికి వచ్చామని ఆయన వెల్లడించారు. విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో వారికి ప్రవేశం కల్పిస్తామని వీసీ పేర్కొన్నారు. 'మణిపూర్‌లో విధ్వంసం జరుగుతున్న కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి యూనివర్సీటీ ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది. వివిధ ప్రోగ్రామ్‌లలో చేరిన వారికి సైతం వసతి కల్పిస్తాం. ప్రవేశం పొందిన విద్యార్థులు వారి విద్యార్హత పత్రాలను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తాం. ఫిజికల్ ఎడ్యుకేషన్‌ విభాగంలో ప్రవేశం పొందడానికి మణిపూర్‌ విద్యార్థి ఒకరు ఆసక్తి కనబర్చారని' వీసీ వివరించారు. మణిపూర్‌ విద్యార్థులు తమకు ప్రవేశాలు కల్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను ఇది వరకే సంప్రదించారని కన్నూర్‌ యూనివర్సీటీ ఉప కులపతి డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్ తెలిపారు. గత నెలలో మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు తిరువనంతపురంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ చర్య తరువాతే మణిపూర్‌ విద్యార్థులు తనతో సంప్రదింపులు చేయడానికి ముందుకు వచ్చారని వీసీ వివరించారు. ఇలాంటి మంచి పనులతో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)