ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిమ్స్‌ బిల్డింగ్‌లోని ఎండోస్కోపీ రూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే హాస్పిటల్‌ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎండోస్కోపి రూమ్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అక్కడ ఉన్న రోగులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. రోగులతోపాటు సిబ్బంది కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. ఎయిమ్స్ లో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ రూమ్‌లో మంటలు చెలరేగడంతోతో దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా పొగ బయటికి రావడంతో ఏం జరుగుతోందో సిబ్బంది, రోగులకు తెలియని పరిస్థితి నెలకొంది. పేషంట్లు వారితోపాటు ఉన్న అటెండెంట్లు మరియు ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదం సమయంలోనే పేషంట్లను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. తాత్కాలికంగా ఎమర్జెన్సీ వార్డును మూసివేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగిన ఎండోస్కోపీ రూమ్ కింది అంతస్తులోనే ఎమర్జెన్సీ వార్డు ఉండటంతో అక్కడ ఉన్న పేషంట్లు, సిబ్బందితోపాటు డాక్టర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు రాగానే ఫైర్ అలారమ్ మోగడంతో సిబ్బంది అప్రమత్తమ్యయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి జరిగిన విషయం చెప్పడంతో వారు రంగంలోకి దిగారు. ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 6 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను పూర్తిగా అదుపు చేసినట్లు వెల్లడించారు. సకాలంలో స్పందించి ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగడంతో మంటలు ఇతర వార్డులకు వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నట్లు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)