దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరం !

Telugu Lo Computer
0


దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నిలిచింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్ట్రాటెజీ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కె పిలానియా దీనిపై అధ్యయనం చేశారు. కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలు, వృత్తి, మతం, కొవిడ్-19 ప్రభావం, దాతృత్వం అనే ఆరు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే అధ్యయనం నిర్వహించారు. ఈ అంశాలు ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఆనందంపై ఏ విధమైన ప్రభావం చూపుతున్నాయో పరిశీలించి మిజోరంను అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా గుర్తించారు. వందశాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రం మిజోరం. ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి చిన్నతనంలోనే తండ్రికి దూరమయ్యాడు. అప్పటి నుంచి అతడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతడు చదువు కొనసాగించే విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నాడు. భవిష్యత్‌లో చార్టెర్డ్ అకౌంటెంట్‌ కావాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అది సాధించలేకపోతే సివిల్‌ సర్వీసెస్‌ రాయాలని ఆశిస్తున్నాడు. అదే పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరాలనుకుంటున్నాడు. అతడి తండ్రి పాల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. తల్లి గృహిణి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం తమ లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ''మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు. మేం ఏ విషయంలోనూ మొహమాటపడం. ఏ సందర్భంలోనూ భయపడం'' అని ఓ విద్యార్థి తెలిపాడు. ఉపాధ్యాయులు విద్యార్థులు, వారి తల్లితండ్రులతో క్రమం తప్పకుండా సమావేశమవుతారు. విద్యార్థులు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా తల్లిదండ్రులతో చర్చించి పరిష్కారమార్గాన్ని సూచిస్తారు. మిజోరం సమాజ నిర్మాణం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ''ఇది కుల రహిత సమాజం. అందుకు అనుగుణంగానే పెంపకం ఉంటుంది. చదువు విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయరు'' అని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు తెలిపారు. ఆడ, మగ అనే భేదం లేకుండా యువత 16, 17 ఏళ్ల వయస్సులోనే ఉపాధి పొందుతున్నారు. చిన్న వయసులోనే సంపాదించడాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు. అంతేకాక ఇక్కడ ఏ పనినీ చిన్నదిగా పరిగణించరు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష లేదు. మిజోరంలో విచ్ఛిన్నమైన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లోనూ తమ పిల్లల్ని ఉన్నతంగా పెంచుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉంటారని నివేదిక పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)