బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేని వారికి రూ.16 కోట్ల రుణం చెల్లించాలని నోటీసు !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ సోలంకి అనే వ్యక్తి తన భార్య జాషి బెన్‌తో రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఉత్తర్​ ప్రదేశ్‌కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మీరు రూ. 16 కోట్లు అప్పు ఉన్నారని, మార్చి 4వ తేదీ లోపు వాటిని చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. రుణం చెల్లింకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక కూడా చేశారు. దీంతో శాంతిలాల్​ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అతని భార్య సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో చికిత్స కోసం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శాంతిలాల్‌ కుటుంబం ఈ నోటీసుల గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎటువంటి లాభం లేకపోయింది. అనంతరం శాంతిలాల్ స్థానిక ఎమ్మెల్యే నీరజ్​ చోప్రాను ఆశ్రయించారు. ఎమ్మెల్యే చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. శాంతిలాల్​ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 నుంచి 10 లక్షలు ఉంటాయన్న నీరజ్​ చోప్రా, అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఇదొక ఫేక్​ నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్​ కుటుంబం ఆసుపత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్‌పై విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్​ చేశారు. నోటీసులో రుణం పేర్కొన్న ఆస్తికి అషర్ ఇన్‌ఫ్రా లాజిక్ కంపెనీ యజమానిగా పేర్కొనడం కూడా ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టి చూస్తే నోటీసు పంపడంలో బ్యాంకు పొరపాటు పడే అవకాశం బలంగా ఉంది. అలా అయితే, శాంతిలాల్ సోలంకికి తప్పుడు నోటీసులు పంపించిన వారిపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)